తెప్ప‌పై శ్రీగోవిందరాజస్వామివారు అభ‌యం

తెప్ప‌పై శ్రీగోవిందరాజస్వామివారు అభ‌యం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 18: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమ‌వారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్ర‌హించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

తెప్పలను అధిరోహించిన  శ్రీ గోవిందరాజస్వామిస్వామివారు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా మంగళవారం శ్రీగోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అదికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.