జూన్ 17న‌ శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
By TTD News On 16 Jun, 2019 At 12:36 PM | Categorized As Press Releases

జూన్ 17న‌ శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

తిరుపతి, 2019, జూన్ 16: అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమ‌వారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 8.30 గంటల నుండి 10.00 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలను, విద్యుత్‌ దీపాలంకరణలు పూర్తి చేశారు. అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాలు సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర :

అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారం మధ్యాహ్నం 2.00 గంటలకు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో శోభాయాత్ర సాగి ఆల‌యానికి చేరుకుంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v