ఏప్రిల్‌ 18న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 9 Apr, 2019 At 08:30 PM | Categorized As General News

ఏప్రిల్‌ 18న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

ఏప్రిల్‌ 09, తిరుపతి, 2019: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్‌ 18న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీరాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారని, పటిష్టమైన క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి విజిలెన్స్‌ అధికారులు కడప జిల్లా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు వైద్యసేవలు అందించాలని, మెరుగైన పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులకు సౌకర్యాల కల్పన పర్యవేక్షణ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ కొరత లేకుండా సరఫరా చేసేందుకు ముందుస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కల్యాణం రోజున భక్తులు కొనుగోలు చేసేందుకు వీలుగా 10 వేల శ్రీవారి లడ్డూలను నిల్వ ఉంచుకోవాలన్నారు.

పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జెఈవో ఆదేశించారు. గత అనుభవాల నేపథ్యంలో వడగండ్లు, ఈదురుగాలులకు తట్టుకునేలా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు టిటిడి ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ముగ్గురు డెప్యూటీ ఈవోలు, 9 మంది సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బందితోపాటు 1000 మంది శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అందుబాటులో ఉంటారని విరించారు. శోభాయమానంగా విద్యుత్‌ అలంకరణలు, డిస్‌ప్లే స్క్రీన్లు, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేయాలని, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఎపిఎస్‌ఆర్‌టిసి అధికారులతో టిటిడి రవాణా విభాగం సమన్వయం చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో ఒంటిమిట్ట కోదండరామాలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, టిటిడి ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v