LORD TAKES A CELESTIAL RIDE ON GAJA VAHANAM_ గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

Srinivasa Mangapuram, 1 March 2019: The Lord Sri Kalyana Venkateswara Swamy took a celestial ride on Gaja Vahana on Friday evening in Srinivasa Mangapuram.

GAJA VAHANAM: In Hindu mythology, Gaja stands for majesty, pride, prosperity and intelligence. To showcase all the important qualities which are required for a human being to become successful in his or her life, the Lord took a celestial ride on Gaja vahanam.

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

తిరుప‌తి, 2019 మార్చి 01: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్ర‌వారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఇంటిముందు ఏనుగులగుంపులు బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉండడం – ఐశ్వర్యానికి పరాకాష్ఠ. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. శ్రీవేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీథులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. కనుక పట్టపుటేనుగుపై ఊరేగడం చక్రవర్తి లక్షణం. శ్రీవారు విశ్వ చక్రవర్తి కనుక – ఆవిషయాన్ని గుర్తుచేస్తూ – ఏనుగుపై ఊరేగింపుగా వస్తాడు.

‘గజం’ అనేపదం రాకపోకలుగల ప్రకృతికి సంకేతం. అంటే విశ్వానికి సంకేతం. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. గజరాజులు రోజూ శ్రీవారిసేవలో పాల్గొంటూనే ఉంటాయి. కానీ తమపై స్వామి అధిరోహించేదెప్పుడా అని ఎదురుచూస్తుంటాయి. ఆ గొప్పఅవకాశం బ్రహ్మోత్సవాలలో వాటికి లభిస్తుంది. తమజాతిలో ఏ ఒక్క ఏనుగుపై స్వామి అధిష్ఠించినా – ఆజాతికంతా సంతోషమే. పైగా స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగానూ, ఏనుగు స్వామికివాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.

ప్రత్యక్షంగా ఏనుగులు ముందుంటాయి. వాహనరూపమైన ఏనుగు పల్లకీలో ఉంటుంది. ఏవిధంగానైనా గజవాహనసేవ ప్రశస్తమైందే, శరణాగతికి గజేంద్రునిసేవ ఉదాహరణం.

భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు. భక్తితో ప్రార్థిస్తే తప్పకవచ్చి రక్షిస్తాడనే సంగతిని గజవాహనోత్సవం సూచిస్తూంది. అన్నీవదలి తననే శరణుకోరిన – గజేంద్రుణ్ణి రక్షించినట్లే మిమ్మల్నీ రక్షిస్తానని స్వామి అభయప్రదానం – గజవాహనసేవలో వ్యక్తమవుతుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.