ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ
By TTD News On 10 Aug, 2018 At 11:54 AM | Categorized As Press Releases

ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

ఆగస్టు 10, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ జరుగనుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవాలయాల్లో లోకసంక్షేమం కోసం ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇందుకోసం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో 28 హోమగుండాలను ఏర్పాటుచేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది ఋత్వికులు, 100 మంది వేదపండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుండి 20 మంది వేద విద్యార్థులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణం చేస్తారు.

1958, ఆగస్టు నెలలో విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణకవచ తాపడం జరిగింది. సరిగ్గా 60 ఏళ్ల తరువాత అదే విళంబినామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ జరుగుతుండడం విశేషం.

ఈ వైదిక కార్యక్రమం కారణంగా ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు రూ.300/- టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వబడవు. విఐపి బ్రేక్‌ దర్శనాలు, ఆర్జితసేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు(వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు) రద్దయ్యాయి.

దైనందిన మహాసంప్రోక్షణ కార్యక్రమ వివరాలు :

ఆగస్టు 11న అంకురార్పణ :

– ఆగస్టు 11వ తేదీన ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. దీనినే ఆచార్యవరణం లేదా ఋత్విక్‌ వరణం అంటారు.

– రాత్రి 7 నుండి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. వసంతమండపం వద్ద పుట్టమన్ను సేకరించి రాత్రి 9 నుండి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపడతారు.

ఆగస్టు 12న :

– ఆగస్టు 12న ఉదయం 6 గంటల తరువాత ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటల తరువాత కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరు దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.

– మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుండి హోమాలు నిర్వహిస్తారు.

ఆగస్టు 13, 14వ తేదీల్లో :

– ఆగస్టు 13న విశేషహోమాలతోపాటు అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. ఆగస్టు 13, 14వ తేదీల్లో గర్భాలయంతోపాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు.

– అష్టబంధనం గురించి భృగుప్రకీర్ణాధికారం, విమానార్చన ప్రకల్పం గ్రంథాల్లో వివరించబడి ఉంది.

– 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా అష్టబంధనాన్ని సమర్పిస్తారు.

ఆగస్టు 15న :

– ఆగస్టు 15న ఉదయం కైంకర్యాల అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవమూర్తులకు యాగశాలలోనే అభిషేకం చేస్తారు.

ఆగస్టు 16న :

– ఆగస్టు 16న ఉదయం 10.16 నుండి 12 గంటలలోపు కళావాహన చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి మూలమూర్తికి, విమానగోపురానికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు తిరిగి కుంభంలోని శక్తిని ఆవాహన చేస్తారు.

– ఆ తరువాత ఆరాధన, నైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది.

– ఆగస్టు 16న సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడపంచమి సందర్భంగా అదేరోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v