ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
By TTD News On 31 Jul, 2017 At 11:12 AM | Categorized As Press Releases

ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

జూలై 31, తిరుపతి, 2017 తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 3న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 4న పవిత్ర సమర్పణ, ఆగస్టు 5న పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 2వ తేదీన వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలు రద్దయ్యాయి. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు తిరుప్పావడసేవ, నిజపాదదర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మూెత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేయడమైనది. ఆయా రోజుల్లో ఆర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఆగస్టు 2న ఆచార్య రుత్విక్‌వరణం :

పవిత్రోత్సవాల అంకురార్పణం రోజైన ఆగస్టు 2న శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఉదయం 5 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహిస్తారు. అర్చకులకు విధుల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు. యాగకర్మలు, పుణ్యాహవచనం, హోమాలు తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణకోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `