జ‌న‌వ‌రి 21న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
By TTD News On 18 Jan, 2019 At 02:43 PM | Categorized As Press Releases

జ‌న‌వ‌రి 21న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

జనవరి 18, తిరుమల 2019: క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమల దివ్య క్షేత్రంలో జ‌న‌వ‌రి 21వ తేదీ సోమ‌వారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది.

పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించిన యెడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి.

”శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి” ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితి. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణాను సారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందెను.

ఎవరైన మానవులు అజ్ఞానంతో తల్లి దండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషమును, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం.

ఈ పర్వదినంనాడు ఉద‌యం 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగియనున్నది.

ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు మరియు టిటిడి అధికారులు పాల్గొంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v