ఆగస్టు 18, 19 తేదీల్లో తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
By TTD News On 17 Aug, 2018 At 02:59 PM | Categorized As Press Releases

ఆగస్టు 18, 19 తేదీల్లో తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 ఆగస్టు 17: శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 18, 19వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా నిర్వహించేందుకు అందంగా ముస్తాబు చేశారు.

తరిగొండలో

వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు డా|| పి.రమణవాణి, శ్రీమతి జి.లావణ్య బృందం సంగీతసభ, రాత్రి 7.00 గంటలకు శ్రీమతి పి.జయంతిసావిత్రి బృందం హరికథ పారాయణం చేయనున్నారు. అదేవిధంగా ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుపతిలో….

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 18వ తేదీన ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీ జి.మధుసూదనరావు బృందం సంగీత సభ నిర్వహిస్తారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రం 6.00 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీమతి కె.విశాలాక్షి, శ్రీమతి జి.రేవతి బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమలలో…..

ఆగస్టు 19వ తేదీ ఉదయం 9.00 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టిటిడి ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

చరిత్రక ప్రాశస్త్యం…

తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతు లకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి.

వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యుల వారిని ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ కావడం విశేషం. క్రీ.శ. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `