తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, 19న వైకుంఠ ద్వాద‌శి
By TTD News On 11 Dec, 2018 At 04:05 PM | Categorized As Press Releases

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, 19న వైకుంఠ ద్వాద‌శి

డిసెంబ‌రు 11, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా డిసెంబరు 18వ తేదీన‌ తెల్లవారుజామున 12.30 నుండి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థం..

ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నులపండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

డిసెంబరు 19న చ‌క్ర‌స్నానం

డిసెంబ‌రు 19వ తేదీన‌ వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి కూడా తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా డిసెంబరు 18, 19వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `