శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
By TTD News On 16 Apr, 2019 At 05:00 PM | Categorized As General News

శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఏప్రిల్ 16, తిరుమ‌ల‌, 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు జ‌రుగ‌నున్న‌ సాలకట్ల వసంతోత్సవాలకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వ‌సంత మండ‌పాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్‌దీపాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత‌ మండపానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ ఆస్థానం చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత విశేష స‌మ‌ర్ప‌ణ చేస్తారు. స్వామి, అమ్మ‌వార్లు సాయంత్రం 6.30 గంట‌ల‌కు అక్క‌డినుండి బ‌య‌ల్దేరి ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకుంటారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

ఈ ఉత్స‌వం కార‌ణంగా బుధ‌వారం స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v