సంజీవని తెచ్చిన సంజీవరాయడు
By TTD News On 14 Apr, 2019 At 03:29 PM | Categorized As Brahmotsavams, Special Articles

సంజీవని తెచ్చిన సంజీవరాయడు

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్‌ 14: ఒంటిమిట్టలోని శ్రీ ఆంజనేయస్వామివారు సంజీవరాయడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సంజీవరాయని ఆలయ పురాణ ప్రాశస్త్యం ఇలా ఉంది.

ఒంటిమిట్ట గుడిలో సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉండగా కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. ఇది అరణ్యవాస కాలం నాటి దృశ్యం. అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం హనుమంతునికి కాలేదు. ఆ కారణం చేతనే ఒంటిమిట్ట గుడిలో ఆంజనేయస్వామి లేడంటారు. రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటును కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయస్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయడుగా కొలువుదీరి ఉన్నాడు. రామరావణ యుద్ధంలో వానరులు మరణించినపుడు, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రెండుసార్లు హిమాలయ పర్వతాలు దాటి మహేంద్రగిరికి వెళ్లి నాలుగు రకాల సంజీవని మూలికలను ఆంజనేయుడు తెచ్చినట్టు పురాణ కథనం. కావున ఇక్కడిస్వామివారికి సంజీవరాయడని పేరు వచ్చింది.

చెరువు కట్ట మీద కూడా ఆంజనేయస్వామివారు కొలువై ఉన్నారు. నీటి వల్లగానీ, వరిపొలంలో తిరుగుతున్నపుడు గానీ, ఈ బాటలో యాత్ర చేస్తున్నప్పుడు గానీ ప్రాణభయం కలగకుండా ఈ ఆంజనేయస్వామి కాపాడతారని భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామివారు శారీరక మానసిక రోగాలు పోగొడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v