SRIVARI NAVARATRI BRAHMOTSAVAMS FROM OCTOBER 15-23 _ అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

GARUDA VAHANAM- OCTOBER 19

PUSHPAKA VIMANAM- OCTOBER 20

SWARNA RATHAM- OCTOBER 22

CHAKRASNANAM- OCTOBER 23

Tirumala,03 October 2023: TTD is organising the grand Srivari Navaratri Brahmotsavam fete from October 15-23 in view of Adhikamasam, which occurs once in three years occurring as per Chandrayaana during Ashwiyuja (Dasara) month.

Sans the Dwajarohanam Dwajaavarohanam, Snapana thirumanjanam and Rathotsavam festivities, other important events of the Navaratri Brahmotsavam are Garuda Vahana on October 19, Pushpaka Vimanam on 20, Swarna Ratham-22, and Chakra Snanam on 23.

All Vahana Sevas are held in the mornings (8-10 am) and evening (7-9 pm) excepting the prestigious Garuda Vahana Seva from 7.00 pm to still late in the night.

Highlights of other events of the nine-day festival are as follows.

Ankurarpanam 14-10-2023 (7.00pm-9.00 pm ).

Bangaru Tiruchi utsavam (15-10-2023) ( morning 9am ) 

Pedda Sesha Vahana ( 15-10-2023) ( night 7-9 pm)

Chinna Sesha Vahana ( 16-10-2023) ( 8-10 am)

Hamsa vahanam( 16-10-2023)( 7-9pm )

Simha Vahanam ( 17-10-2023)( morning 8-10 am)

Muthayapu Pandiri Vahanam (17-10-2023)( 7-9 pm)

Kalpavruksha Vahanam  (18-10-2023)(8-10am)

Sarvabhupala Vahanam  (18-10-2023)(7-9 pm) 

 
Mohini Avataram (19-10-2023)(8 -10 am)

Garuda Vahanam (19-10-2023)( 7-12 midnight)

Hanumanta Vahanam (20-10-2023)(8-10 am )

Pushpaka Vahanam  (20-10-2023) (4pm ) 

Gaja Vahana  (20-10-2023)(7- 9 pm )

Surya Prabha Vahana  (21-10-2023)( 8 -10 am)

Chandra Prabha Vahana (21-10-2023)( 7 -9 pm )

Swarna Ratham  (22-10-2023)(7.15 am )

Ashwa Vahana  (22-10-2023)( 7 -9 pm)

Chakra snanam (23-10-2023) (6am)

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం,

అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం

తిరుమల, 2023 అక్టోబరు 03: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.

అంకురార్పణం(14-10-2023)(రాత్రి 7 నుండి 9 గంటల వరకు)

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బంగారు తిరుచ్చి ఉత్స‌వం (15-10-2023) (ఉద‌యం 9 గంట‌ల‌కు)

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొదటిరోజు ఉద‌యం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు.

పెద్దశేషవాహనం(15-10-2023) (రాత్రి 7 గంటలకు)

మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

చిన్నశేషవాహనం(16-10-2023)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

హంస వాహనం(16-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.

సింహ వాహనం(17-10-2023)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు – భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.

ముత్యపుపందిరి వాహనం(17-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.

కల్పవృక్ష వాహనం (18-10-2023)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం (18-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.

మోహినీ అవతారం (19-10-2023)(ఉదయం 8 గంటలకు)

బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.

గరుడ వాహనం(19-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(20-10-2023)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

పుష్పకవిమానం (20-10-2023) (సాయంత్రం 4 గంట‌ల‌కు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి పుష్పకవిమానం విహ‌స్తారు. పుష్ప‌క విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచేపు చేస్తారు.

గజవాహనం(20-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.

సూర్యప్రభ వాహనం(21-10-2023)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి.

చంద్రప్రభ వాహనం(21-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మో త్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

స్వర్ణరథం(22-10-2023)(ఉదయం 7.15 గంటలకు)

శ్రీవారి బ్రహ్మో త్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.

అశ్వవాహనం(22-10-2023)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.

చక్రస్నానం(23-10-2023)(ఉదయం 6 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.