అన్నమయ్య సంకీర్తనల్లో భగవద్గీత సారం : డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య

అన్నమయ్య సంకీర్తనల్లో భగవద్గీత సారం : డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య

తిరుపతి, ఏప్రిల్‌  08, 2013: తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో భగవద్గీత సారం ఉందని తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య  తెలిపారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి.

మొదటి రోజు సాహితీ సదస్సుకు డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ”అన్నమయ్య పదాలలో గీతార్థాలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ భగవద్గీతలోని కొన్ని శ్లోకార్థాలు స్ఫురించేలా మృదుమధురమైన తెలుగు పదాలతో అన్నమయ్య సంకీర్తనలు రచించారని తెలిపారు. ఈ సంకీర్తనలు భక్తి, శృంగార, సామాజిక స్పృహతో కూడి ఉన్నాయన్నారు. భగవద్గీత శ్లోకాలతో ఏకరూపత ఉన్న పలు సంకీర్తనలను ఆయన పాడి వినిపించారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా కడపకు చెందిన డాక్టర్‌ రాచపాళెం చంథ్రేఖరరెడ్డి ”అన్నమయ్య సంకీర్తనల్లోని సామాజికాంశాలు” అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నమయ్యను ప్రాచీన కాలపు సంఘ సంస్కర్తగా అభివర్ణించారు. ఆ కాలంలోనే ఈయన వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తారని తెలిపారు. ఒక వర్గానికి మాత్రమే సొంతమని భావించిన భగవంతుడిని సాధారణ భక్తుల హృదయాల్లోకి తీసుకెళ్లారని వివరించారు. అన్నమయ్య ప్రత్యామ్నాయ సామాజిక వ్యవస్థను ప్రతిపాదించారని ఆయన పేర్కొన్నారు.

కర్నూలు సిల్వర్‌జూబ్లీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌ ”అన్నమయ్య పదకవితా వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తూ పదకవితకు అన్నమయ్య పట్టం కట్టారని కొనియాడారు. వీటిలో శబ్దానికి ప్రాధాన్యం ఉంటుందని, చక్కటి తెలుగుదనం, భక్తి వైరాగ్యం కనిపిస్తాయని తెలిపారు.

హైదరాబాదుకు చెందిన శ్రీ జి.బి.శంకరరావు ”అన్నమయ్య సంకీర్తనల్లోని అష్టవిధ నాయికలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ ఎనిమిది విభిన్న మనస్తత్వాలు గల నాయికలు స్వామివారిని చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు, అనుసరించిన పద్ధతులను వివరించారు. నాయికల భావనలన్నీ అన్నమయ్యవేనని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య పాటలు నిత్యనూతనాలని, అవి ఎల్లప్పుడూ ప్రజల్లో నిలిచిపోతాయని తెలిపారు. ఈ సందర్భంగా తితిదే వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.జె.కృష్ణమూర్తి ఉపన్యాసకులకు శ్రీవారి ప్రసాదం, శాలువతో సన్మానించారు.

అనంతరం సాయంత్రం 6.00  నుండి 7.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన టి.సాయి భవ్యశ్రీ బృందం సంగీత సభ, రాత్రి 7.45 నుండి 9.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి పి.జయంతి సావిత్రి బృందం హరికథ వినిపించనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.