BRAHMOTSAVAMS BEGIN WITH GARUDA DHWAJAROHANAM AT APPALAYAGUNTA _ అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనారంభం

Tirupati, June 25, 2026: The annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta commenced grandly on Thursday with the sacred Garuda Dhwajarohanam amidst Vedic chants and Govinda namasmarana.

The Garuda flag was ceremonially hoisted as per Agama traditions, symbolically inviting all celestial beings and deities to participate in the nine-day festival.

Following the Dhwajarohanam, Snapana Tirumanjanam was performed to the deities. TTD has made elaborate arrangements for devotees, including Annaprasadam, drinking water, medical facilities, flower decorations, and cultural programs.

The first Vahana Seva, Pedda Sesha Vahanam, will be held on Thursday night. A large number of devotees participated in the inaugural celebrations.

CVSO Sri Muralikrishna, Temple DyEO Sri Haridranath, AEO Sri Devarajulu, SE Sri Narasimha Murthy, Kankanam Bhattar Sri Suryakumar Archayulu, Suptd Sreevani, Temple Inspector Sri Venugopal, Archakas and others participated in the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడ ధ్వజారోహణంతో ఆధ్యాత్మిక వైభవానికి శ్రీకారం

అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనారంభం

గోవింద నామస్మరణల మధ్య ధ్వజారోహణంముక్కోటి దేవతలకు ఆహ్వానం

తిరుపతి, 2026 జూన్ 25: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య కర్కాటక లగ్నంలో ఉదయం 08.30 నుండి 09.00 గం.ల వరకు వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

స్వామివారి సాక్షిగా గరుడ ధ్వజ ప్రతిష్ఠ

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో గరుత్మంతుని రూపాన్ని నూతన వస్త్రంపై లిఖించి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఈ ధ్వజారోహణం ద్వారా 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గరుడధ్వజారోహణాన్ని దర్శించిన భక్తులకు విశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి.

తిరుచ్చి ఉత్సవంఉత్సవాలకు ముందస్తు పర్యవేక్షణ

అంతకుముందు సుప్రభాతం, విశ్వరూప దర్శనం, తోమాల సేవ, కొలువు, అర్చన తదితర నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తిరుచ్చి ఉత్సవం, భేరితాడనం, భేరిపూజ, నవసంధి, మాడవీధి ఉత్సవం, ఆస్థానం ఘనంగా నిర్వహించారు.

భక్తులను కరుణాకటాక్షాలతో అనుగ్రహిస్తున్న ప్రసన్న వేంకటేశ్వరుడు

ఈ ఆలయంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు శంఖు, చక్రాలను ధరించి కటిహస్తం, అభయహస్త ముద్రలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాలక్ష్మీ అమ్మవారు, గరుత్మంతుడు, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి సన్నిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

భక్తుల సౌకర్యార్థం టిటిడి విస్తృత ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ, చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, వైద్యసేవలు, పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ధార్మిక ప్రవచనాలు, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వేడుకగా స్నపన తిరుమంజనం

ధ్వజారోహణం అనంతరం స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనం ఉదయం 10.15 నుండి 11.30 గం.ల వరకు నిర్వహించారు.

రాత్రి పెద్దశేష వాహనసేవ

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనసేవ అయిన పెద్దశేష వాహనసేవ వైభవంగా జరగనుంది.

పుష్ప, విద్యుద్దీపాలంకరణలతో ఆధ్యాత్మిక శోభ

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం సుందరమైన పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలతో కళకళలాడుతోంది. ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందాలని టిటిడి భక్తులను కోరింది.

ఈ కార్యక్రమంలో టిటిడి సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్.. శ్రీ నరసింహామూర్తి, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండ్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది