అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలకు అరగంటకో ఆర్‌టిసి బస్సు : జెఈవో

అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలకు అరగంటకో ఆర్‌టిసి బస్సు : జెఈవో

తిరుపతి, జూన్‌ 16, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా తిరుపతి నుండి ప్రతి అరగంటకు ఒక ఆర్‌టిసి బస్సు నడపనున్నట్టు తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో గంటకో బస్సు ఉంటుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌టిసి, పోలీసు, తితిదే అధికారులతో సమావేశం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా వసతి, భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో అధిక సంఖ్యలో వాహనాల పార్కింగ్‌ కోసం ఖాళీ స్థలాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తితిదే ఉద్యోగుల సౌకర్యార్థం క్వార్టర్ల నుండి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అప్పలాయగుంటకు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి నుండి శని, ఆదివారాల్లో ఇప్పటివరకు ఒక బస్సు మాత్రమే నడిచేదని, ఇక నుండి మూడు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్‌టిసి అధికారులను కోరారు. భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తితిదే భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో తితిదే సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, తితిదే ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, ఆర్‌టిసి డిపో మేనేజర్‌ శ్రీ భాస్కర్‌రెడ్డి  ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

ధర్మరథాల ద్వారా బ్రహ్మోత్సవాల ప్రచారం :

తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ధర్మరథాల ద్వారా అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ధర్మరథాల్లోని భజన బృందాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి భక్తులను ఆహ్వానిస్తున్నారు. ఇవి ఆదివారం విశాలపురం, పుత్తూరు, కొత్తూరు, చెర్లోపల్లి, గొల్లపల్లి, కల్యాణపురం, ఎస్‌బిఆర్‌ పురం, రేణిగుంట మండలంలోని పూడి, కదిరిమంగళం, గాజులమండ్యం, కెఎల్‌ఎం హాస్పిటల్‌, వడమాలపేట, తాతయ్యకాలువ, చిన్నపాళెం, కురకాలువ, జిపాళెం, పాపానాయుడుపేట, గుడిమల్లం, అత్తూరు, కల్లూరు, మొలగమూడి తదితర గ్రామాల్లో పర్యటించాయి.

సోమవారం సింగరాయపాళెం, కొట్టిగూడు, ఎగువగూడూరు, పచ్చికాల్వ, దిగువగూడూరు, తండ్లం, దామినేడు, మల్లేల, రేణిగుంట, కాటన్‌మిల్‌ తదితర ప్రాంతాల్లో ధర్మరథాలు పర్యటించి ప్రచారం చేయనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.