అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలపై తితిదే జెఈఓ సమీక్ష
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలపై తితిదే జెఈఓ సమీక్ష
తిరుపతి, జూన్ 11, 2013: జూన్ 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో మంగళవారం సాయంత్రం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా జూన్ 13వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు తెలిపారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అప్పలాయగుంట, తిరుపతి పరిసర గ్రామాలకు ప్రచార రథాల్లో భజన బృందాలను పంపి భక్తులను ఆహ్వానించాలని కోరారు. ప్రచార రథాలు అప్పలాయగుంట నుండి జూన్ 14వ తేదీన బయలుదేరతాయన్నారు. విష్ణుసహస్రనామం, శ్రీ వేంకటేశ్వరనామావళి, అప్పలాయగుంట స్థలపురాణం తదితర 50 వేల పుస్తకాలను భక్తులకు పుస్తక ప్రసాదంగా అందించాలని ఆదేశించారు. ఆలయ ముందు భాగంలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి నాలుగు మాడ వీధుల్లో రంగవల్లులు తీర్చిదిద్దాలన్నారు. తిరుపతి, తిరుచానూరు, అప్పలాయగుంట పరిసర ప్రాంతాల్లో స్వాగత ఆర్చిలు, దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి లడ్డూలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి వడలు తీసుకొచ్చి ప్రసాద విక్రయకేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాథమిక చికిత్సా కేంద్రం, అంబులెన్స్, ఆయుర్వేద వైద్య శిబిరం, పాదరక్షలు భద్రపరుచుకునేందుకు కౌంటర్, గోపూజకు అవసరమైన తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహన సేవల సమయంలో మొబైల్ ఎల్సిడి తెరలు ఏర్పాటుచేసి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండాలని, మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.
ఆలయంలో భక్తులను ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపట్టాలని కోరారు. వాహన సేవల సమయంలో భజన బృందాలు, కోలాటాలు, ఏనుగులు, గుర్రాలు, కేరళ ప్రత్యేక వాయిద్య బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు జెఈవో వెల్లడించారు. వాహన సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేయాలని, భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతిలోని నిర్ణీత ప్రాంతాల నుండి నిర్ణీత సమయాల్లో తితిదే ఉచిత బస్సులను అప్పలాయగుంటకు నడపనున్నట్టు తెలిపారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై ఆర్టిసి అధికారులతో చర్చించినట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజి, స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్‌రెడ్డి, తిరుచానూరు, అప్పలాయగుంట అర్చకస్వాములు, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.