అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి : తితిదే ఈవో

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి : తితిదే ఈవో

తిరుపతి, జూన్‌ 16, 2013: జూన్‌ 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు.
అప్పలాయగుంటలోని స్వామివారి ఆలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది మరింత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో జూన్‌ 22వ తేదీ గరుడసేవ రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుండి ”లక్ష్మీహారం” ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరించనున్నట్టు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన పుణ్యక్షేత్రాల్లో అప్పలాయగుంట ఒకటన్నారు. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న అనంతరం శ్రీవారు ఈ మార్గంలోనే తిరుమలకు ప్రయాణించినట్టు తెలిపారు. అప్పలాయగుంట వద్ద గల వేముల పర్వతంపై తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వరుడు అనే రుషి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ బస చేసినట్టు పురాణాలు చెబుతున్నాయన్నారు. భక్తులకు అభయమిచ్చేందుకు స్వామివారు అభయహస్తంతో ఇక్కడ వెలిశారని వివరించారు. తిరుపతి, పరిసర ప్రాంతాలవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వాహనసేవలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

అనంతరం ఆలయంలో వివిధ విభాగాల అధికారులతో తితిదే ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహన సేవల ముందు నాలుగు బృందాల చొప్పున 120 మంది కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయాలన్నారు. స్నపన తిరుమంజనం ఘట్టాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయంలోపల గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట ఏర్పాటు చేయాలని సూచించారు. గరుడ సేవ రోజు మహిళా భక్తులకు ఉచితంగా గాజులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. వాహన సేవల ముందు ఆవిష్కరించేందుకు స్వామివారి క్షేత్ర మహిమ, తిరుమల యాత్ర తదితర ఐదు గ్రంథాల ముద్రణ పూర్తయిందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని, తిరుపతి, పరిసర ప్రాంతాల నుండి అదనపు ఆర్‌టిసి బస్సులు, ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు, ఆలయం లోపల, బయట ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా పంచాయతీ వారితో పాటు మొబైల్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహన సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయ సమీపంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం వద్ద తాత్కాలికంగా విద్యుత్‌ లైట్లు, మంచినీటి వసతి కల్పించాలని ఈవో ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అడిషనల్‌ ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ శ్రీ బాలాజి, ఎస్‌ఈ శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవో(సేవలు) శ్రీ శివారెడ్డి, స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్‌రెడ్డి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ తాంబరరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.శ్రీనివాసులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

రూ.6 లక్షలతో రెండు గంటలు సిద్ధం :

ఆలయానికి రూ.6 లక్షల వ్యయంతో రెండు గంటలను తితిదే సిద్ధం చేయించింది. ఈ గంటలు ఆదివారం ఆలయానికి చేరుకున్నాయి. 300 కేజీల చొప్పున బరువు గల ఈ కంచు గంటలను చెన్నైలోని పూంపుహార్‌లో తయారు చేశారు. వీటిని ఆలయంలోని ఘంటా మండపంలో అమర్చనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.