KOIL ALWAR HELD _ అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 03 JUNE 2025: The temple cleansing fete Koil Alwar Tirumanjanam was observed in Appalayagunta on Tuesday.

In view of annual brahmotsavams commencing from June 06 onwards, this temple cleaning Agamic ritual was observed.

The brahmotsavams will conclude on June 15 while Ankurarpanam will be observed on June 06.

Chief priest Sri Surya Kumaracharyulu, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025, మే 03: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 06 నుండి 15వ తేదీ వరకు జ‌రుగ‌నున్నాయి. జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ఉద‌యం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేప‌ట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ సూర్య‌కుమారాచార్యులు, ఏఈవో శ్రీ దేవరాజులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శివ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వాహన సేవల వివరాలు

07-06-2025 ధ్వజారోహణం – పెద్దశేష వాహనం

08-06-2025 చిన్నశేష వాహనం, హంస వాహనం

09-06-2025 సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

10-06-2025 కల్పవృక్ష వాహనం, శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

11-06-2025 మోహినీ అవతారం, గరుడ వాహనం

12-06-2025 హనుమంత వాహనం, గజ వాహనం

13-06-2025 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

14-06-2025 రథోత్సవం, అశ్వవాహనం

15-06-2025 చక్రస్నానం ధ్వజావరోహణం

ఆలయ విశిష్టత : సుమారు వేయి ఏళ్లుకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న కార్వేటినగర ప్రభువుల పాలనలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి అప్పలాయగుంట ఆలయం ఉండినట్లు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయ ఉత్సవాలు, ఊరేగింపుల తరహాలో అప్పలాయగుంట ఆలయమునందు కూడా కార్వేటినగర ప్రభువులు ప్రధానపాత్ర పోషించి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి.

స్థల పురాణం: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి తపస్సును మెచ్చి, ఆయన కోరిక మేరకు ప్రసన్నుడై అక్కడ అభయ హస్తముతో వెలసినట్లు తెలియుచున్నది.

ఈ ఆలయం తూర్పు ముఖముగా నిర్మింపబడి, గర్భాలయం నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూలమూర్తి చతుర్బుజుడై శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం మరియు అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటూ శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, బాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగియున్నారు. గర్భాలయానికి నైరుతిమూలలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయము, వాయువ్యమూలలో శ్రీగోదాలక్ష్మీ అమ్మవారి ఆలయం స్వామివారికి అభిముఖముగా గరుత్మంతుల వారి విగ్రహము వెలసియున్నది. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 10వ తేదీ సాయంత్రం 4.30 – 6.30 గంటల మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.