అర్చకులు భగవత్ స్వరూపం – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
అర్చకులు భగవత్ స్వరూపం – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
తిరుపతి, జూన్-16, 2008: మన వృత్తి ధర్మాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా వుండేవిధంగా నిరంతరం పనిచేసుకుంటూ పోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేత నందు జరిగిన శైవాగమ అర్చకుల మొదటి బ్యాచ్ శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా ఇ.ఓ.మాట్లాడుతూ అర్చకస్వామి భగవత్ స్వరూపమని, మనకు ఎంత తెలిసినా ఇంకా కొంత తెలుసుకోవాలనే తపన వుంటేనే ముందుకు పోగలడని ఆయన ఉద్భోదించారు. శ్వేత నందు జరుగతున్న ఈ శిక్షణాకార్యక్రమం ప్రతి ఒక్కరు చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో వుండే అర్చకులే గాక, దేశంలో వుండే ఇతర రాష్ట్రాలలో నున్న అర్చకులు కూడా స్వామివారి దర్శనమే గాక పూజావిధానంపై చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించు కోవాల్సిందిగా ఆయన కోరారు.అర్చకులకు సమాజంలో ఎనలేని గౌరవం వుందని, వారికి క్రియలోపం, భక్తిలోపం, శ్రద్దాలోపాలుండరాదని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ శ్రీభూమన్ మాట్లాడుతూ శ్వేతలో పాంచరాత్ర, స్మార్ధ, వైఖానస, శైవాగమాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శైవాగమమునకు సంబంధించి ఇది మొదిటిది కాగా, గత జులైలో ప్రారంభమైన అర్చక శిక్షణా కార్యక్రమంలో ఇది 17వ బ్యాచ్ అని ఆయన తెలిపారు. ఈ శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా నున్న పలు శివాలయాలలో పనిచేస్తున్న దాదాపు 50మంది అర్చకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వేటూరి ప్రభాకరశాస్త్రి, వాజ్ఞయ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా||పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, తరిగొండ వెంగమాంబ కృతుల పరిష్కర్త శ్రీ.కె.జె.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది