అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం
అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం
తిరుపతి, జూలై 04, 2011: స్వామివారి వైభవాన్ని నలుదిశలా చాటిన భక్తాగ్రేసరులలో అన్నమయ్యతో పాటు పురందరదాసుల లాంటి మహనీయులు ఎంతో మంది వున్నారని, వారు చూపిన బాటలో నడవడం ద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలమని తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థ అన్నారు. దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా జరిగిన మెట్లోత్సవం కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంకటాద్రికి సమానమగు పుణ్యక్షేత్రము, శ్రీ వేెంకటేశ్వర స్వామివారికి సరితూగు దైవము ఈ బ్రహ్మాండ మందు లేదని శ్రీ వ్యాసమహర్షి సెలవిచ్చినట్లు ఆయన అన్నారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్ ద్వారా కన్నడ దేశంలోనే కాకుండా ఇటు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలలో సైతం భక్తులు వేల సంఖ్యలో భజన మండళ్ళు ఏర్పాటు చేసి దాస సాహిత్యాన్ని వెదజల్లుతున్నారని తెలిపారు.
తితి దేవస్థానములు ఈ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నామని, అదేవిధంగా భజన మండళ్ళను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో దైవభక్తికి, భజన సంస్కృతి వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
అనంతరం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజనమండళ్ళు సోపానముల ద్వారా నడచి తిరుమలకు చేరుకున్నారు. అటు పిమ్మట మానవాళికి హరిదాసులు అందించిన ఉపదేశములు, సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల ఆస్థాన మండపంనందు నిర్వహించారు.
అనంతరం జెఇఓ డాక్టర్ యన్.యువరాజ్ గాలిగోపురం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రాధమిక వైద్యశాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ సి.ప్రభాకర్, డాక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.