ఆగస్టు 20 నుండి 22వ తేది వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 20 నుండి 22వ తేది వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు
తిరుమల, 2010 ఆగష్టు 8: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 20వ తేది నుండి 22వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవం వేడుకలు (సంపంగి ప్రాకారంలో) వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ 19వ తేది జరుగుతుంది.
ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఈ పవిత్రోత్సవం జరగడం ఆనవాయితి. పవిత్రోత్సవం సందర్భంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఊంజలసేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను 20వ తేది నుండి 22వ తేది వరకు రద్దు చేసారు. అదేవిధంగా వసంతోత్సవం, సహస్రదీపాలకరణ సేవలను 19వ తేదిన రద్దుచేసారు.
ఆర్జిత సేవగా నిర్వహించే ఈ పవిత్రోత్సవంలో రూ.5000/- చెల్లించి ఇద్దరు గృహస్తులు పాల్గొవచ్చును. ఈ టిక్కెట్టు పొందిన వారు 22వ తేది జరుగు పూర్ణాహుతి పూజలో పాల్గొనవచ్చును.
మూడు రోజులలో ఏదేని ఒక రోజున ఒక టికెట్టుపై ఇద్దరిని శీఘ్రదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. మొదటి రెండు రోజులు స్వామివారి ఊరేగింపు తరువాత పవిత్రోత్సవం టికెట్టుదారులను స్వామివారి దర్శనానికి అనుమతించబడదు. గృహస్థులు (దంపతులు) మాత్రమే పూర్ణాహుతిలో పాల్గొనవచ్చును.
వైధిక సాంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళ్ళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగాని సిబ్బంది వల్లగాని తెలిసీ, తెలియక ఇలాంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఏలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు తెలిసీ, తెలియక జరిగే దోషాల పరిహారణార్థం జరిగే పవిత్ర కార్యక్రమమే ”పవిత్రోత్సవం”. ఈ పవిత్రోత్సవాలు కేవలం ఆలయశుద్ది, పుణ్యాహవచనం లాంటి కార్యక్రమాలు మాత్రం కావు. సంప్రోక్షణ కంటే భిన్నమయిన క్రియాకలాపంతో కూడినదే ఈ పవిత్రోత్సవం.
ఈ పవిత్రోత్సవంలో చెన్నై నుంచి విచ్చేసిన నాదస్వరం విద్వాంసులు ప్రత్యేక నాధస్వరాన్ని ఆలపిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.