ఆనందనిలయం-ప్రతిరూపంలో శ్రీవారి సుప్రభాత సేవ షూటింగ్ ప్రారంభం
ఆనందనిలయం-ప్రతిరూపంలో శ్రీవారి సుప్రభాత సేవ షూటింగ్ ప్రారంభం
తిరుపతి, జనవరి-9, 2009: తిరుమలేశుని సన్నిధిలో ప్రతిరోజూతొట్టతొలిగా ప్రారంభమయ్యే ”సుప్రభాత సేవ” ను, అలిపిరిలోని ఆనందనిలయం-శ్రీవారి ప్రతిరూపం సెట్‌లో, శ్రీవేంకటేశ్వరభక్తి ఛానల్ ఈరోజు మధ్యాహ్నం 12.00 గం||లకు చిత్రీకరణ కార్యక్రమం మొదలుపెట్టింది.
ఈ సందర్భంగా విచ్చేసిన మైసూర్ దత్తపీఠం ఉత్తరపీఠాధిపతి శ్రీశ్రీశ్రీదత్తవిజయానందతీర్థ స్వామీజీ మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరుడు ఆనందనిలయుడు యోగనిద్రనుండి శుభోదయాన మేల్కొంటే సర్వజగాలకు శుభోదయం అన్నారు- అటువంటి సుప్రభాతసేవను యావద్భక్తులు తమ ఇండ్లలో కన్నులారా వీక్షించి, పరవశించే విధంగా, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందిస్తున్న, శ్రీవారి సేవలనన్నింటినీ, ప్రతి భక్తుడు చూసి తరించాలన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు మాట్లాడుతూ శ్రీవారి సేవలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశానికి, ఈ సేవల చిత్రీకరణ ప్రారంభోత్సవానికి మైసూర్ శ్రీదత్తపీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దత్తవిజయానందతీర్థ స్వామిజీ రావటం, వారి దివ్యసందేశాన్ని అందివ్వడం ఆనందదాయకం అన్నారు.
ఇ.ఓ.,కె.రమణాచారి మాట్లాడుతూ-శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇత్యాదివన్నీ, ఈ ఛానల్ ద్వారా, ప్రసారం చేయాలని, శ్రీవారి సేవలో పాల్గొనలేని భక్తులందరూ వారి ఇళ్ళనుండే ప్రత్యక్షంగా చూడవచ్చనన్నారు. ఈ ఛానల్ నిర్మాణానికి, తద్వారా శ్రీవారి సేవల్ని చూపించటానికి, కృషిచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (పాలకమండలి సభ్యులు/తుడాఛైర్మన్/భక్తి ఛానల్ డైరెక్టర్)- మాట్లాడుతూ శ్రీవారి సేవల్ని, ప్రత్యక్షప్రసారం గావించబోతున్న తమ సిబ్బందికి శుభాబినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాలకమండలి సభ్యులు శ్రీ ఎ.సుబ్రమణ్యం, తి.తి.దే., ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితులు తి.తి.దే., అధికారగణం, భక్తి ఛానల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తొలిసారిగా సుప్రభాతసేవ షూటింగ్ విశేషాలు
తిరుమల క్షేత్రంలో పవిత్రమైన, ప్రశాంతమైన బ్రాహ్మీముహూర్తంలో అంటే ప్రతిరోజు తెల్లవారుజామున 2.30 నుండి 3.00 గం||ల సమయంలో బంగారువాకిలి ముందర సుప్రభాత స్తోత్రాలను, మేలుకొలుపు పాటలను పఠిస్తూ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని నిద్రలేపే కార్యక్రమం అత్యంత శోభాయమానంగా ఉంటుంది.
శ్రీస్వామివారి కైంకర్యపరులైన అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, సన్నిధిగొల్ల, సుప్రభాతం పఠించే ఆచార్యపురుషులు, మేలుకొలుపు పాటలు గానంచేసే తాళ్ళపాకవారు, దేవస్థానం అధికారులు, ఈ సుప్రభాత సేవలో పాల్గొనటానికి అందరూ బంగారువాకిలి ముందరకు తెల్లవారుజాముననే చేరి నిలచిఉన్నారు.
ఆలయ అర్చకస్వామి బంగారువాకిలికి లోపలివైపున వేచివున్న గడియన కుంచెకోల అనే పరికరంతో, వాకిలికున్న చిన్న రంథ్రంద్వారా బయటనుంచి తీయడం, ఆ తర్వాత సన్నిధిగొల్ల, అధికారుల అనుమతితో బంగారువాకిలికి ఉన్న తాళాలన్నింటినీ తీయడం పిదప గొల్ల దివిటీ పట్టుకొని బంగారువాకిలిని కొద్దిగా తెరచి లోపల ప్రవేశించగా ఆవెనువెంటనే అర్చకస్వామి కౌసల్యాసుప్రజారామ అంటూ గట్టిగా సుప్రభాతాన్ని పఠిస్తూ లోపలికి వెళ్ళటం, వంటి దృశ్యాలు, ఏకాంగి బంగారువాకిలి వద్ద సిద్ధంగా వున్న మహంతు మఠం వారికి నవనీత హారతి పళ్ళాన్ని తీసుకొని లోనికి వెళ్ళిన వెంటనే బంగారు వాకిళ్ళు మళ్ళీ దగ్గరికి వేయడం, ఆ తదనంతరం వాకిలి వద్దనున్న నలుగురైదుగురు ఆచార్యపురుషులు, అర్చకులు బంగారు వాకిలి లోనికి వెళుతూ పఠించిన సుప్రభాతాన్ని కొనసాగించటం తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు మేల్కొలుపు పాటలను పాడటం వంటి దృశ్యాలను అలిపిరి ఆనందనిలయం-శ్రీవారి ప్రతిరూపం సెట్టులో చిత్రీకరించారు.
త్వరలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారి సేవలన్నింటిని యావత్ ప్రపంచంలోని భక్తులందరూ, కన్నులారా, తనివిదీరా, వారి ఇళ్ళనుంచే ప్రత్యక్షంగా వీక్షించే సదవకాశం కలుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.