ఉద్యోగుల ఎంపిక పూర్తి పారదర్శకతతో జరిగింది – ఈవో
ఉద్యోగుల ఎంపిక పూర్తి పారదర్శకతతో జరిగింది – ఈవో
తిరుపతి, 2010 అక్టోబర్ 21: ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఎవరి జోక్యం లేకుండా పూర్తి పారదర్శకతతో జరిగిందని, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక ‘శ్వేత’ భవనము నందు నూతన ఉద్యోగులకు ఏర్పాటు చేసిన నెలరోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు నిరంతరం తమపనిపై శ్రద్ధ చూపాలని, అదేవిధంగా నిత్యం పనివిధానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇప్పటి బ్యాచ్ నందు రాష్ట్రం నలుమూలల నుండి అభ్యర్థులు ఎంపిక చేయబడ్డారని, వీరందరు స్వామివారి ఆశీస్సులతో క్రమశిక్షణగా భక్తులకు సేవలందించడంలోను, అదేవిధంగా పరిపాలనా పరంగా కూడా మెళుకువలు నేర్చుకొని సంస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేయాలని ఇ.ఓ.అన్నారు.
తితిదే జె.ఇ.ఓ డా||యన్.యువరాజ్ మాట్లాడుతూ తితిదేలో ఉద్యోగం రావడం సుకృతంగా భావించాలని అన్నారు. ఉద్యోగులు తాము ఎంత సర్వీసు చేశామన్నది కాదు ముఖ్యం. సంస్థకు, భక్తులకు ఎంత సేవ చేసామన్నదే ముఖ్యం అని తెలిపారు.
నెల రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో దాదాపు 188 మందికి వివిధ అంశాలపై శిక్షణను ఇస్తారు.
ఈ కార్యక్రమంలో తితిదే జె.ఇ.ఓ డా||యన్. యువరాజ్, డిప్యూటి ఇ.ఓ.(సేవలు) శ్రీమతి సూర్యకుమారి, కో-ఆర్డినేటర్ శ్రీ సత్యం తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.