ఉపనిషత్తులు, పురాణాలలోని సారాన్ని కవితా దృష్టితో అన్నమయ్య వర్ణన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు

ఉపనిషత్తులు, పురాణాలలోని సారాన్ని కవితా దృష్టితో అన్నమయ్య వర్ణన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు

తిరుపతి, 2025, మే 17: శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తనలలో ఉపనిషత్తులు, పురాణాల సారాన్ని సహజ కవితా దృష్టి కనిపిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య వెల్లడించారు. తాళ్లపాక అన్నమాచార్యులు వారి 617వ జయంతి సందర్భంగా అన్నమాచార్య కళా మందిరంలో శనివారం సాహితీ సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా అన్నమయ్య పదము – వెంగమాంబ పద్యము అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఉపనిషత్తులు, పురాణాల సారాన్ని శ్రీవేంకటేశ్వరుడుకి అన్వయించి స్వామి వారి మహిమలను భక్త లోకానికి కవితా రూపంలో అందించారన్నారు. వేంకటేశ్వరస్వామి మహత్యాన్ని కావ్యంగా వెంగమాంబ మలిచారన్నారు. వరాహ పురాణం, భవిష్యోత్తర, పద్మపురాణం, వేంకటేశ్వరస్వామి కథలను కావ్యంగా అభివర్ణించారన్నారు. ఇద్దరూ వేంకటేశ్వరస్వామి మహత్యాన్ని సరళంగా భక్తలోకానికి అందించారన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య కవిత్వంలో జీవుడు అనే అంశంపై ఆచార్య తాడేపల్లి పతంజలి మాట్లాడారు. అన్నమయ్య రాసిన సంకీర్తనలలో 600 కీర్తనలలో జీవుడి వర్ణన కనపడుతుందన్నారు. జీవాత్మకు ప్రతినిధిగా వేంకటేశ్వరస్వామి వారిని అభివర్ణించారన్నారు. పరమాత్మకు సంబంధించిన వారే జీవుడు, ఎప్పుడూ పరమాత్మను వీడకుండా కొలవాలని అంతర్గతంగా సందేశం ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా తాళ్లపాక వాజ్మయం – విరాట స్వరూపం అనే అంశంపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ గంధం బసవ శంకరరావు ప్రసంగించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సారస్వత సేవను దాదాపు 200 సంవత్సరాలకు పైగా
తాళ్లపాక అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులు, వారసులు చేశారన్నారు. ఈతరం పరిశోధకులు మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరారు.

సాయంత్రం 6 గం.లకు తిరుపతికి చెందిన డా. ఎం.పి.ఎస్.మాధురి బృందం సంగీత సభ, నెల్లూరుకు చెందిన శ్రీ టి.రమణయ్య బృందం హరికథ జరుగనుంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.