ANNUAL BRAHMOTSAVAM OF CHANDRAGIRI SRI KODANDARAMA SWAMY TEMPLE FROM 6 TO 14 APRIL _ ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025 మార్చి 19: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సర్లకు, చక్రత్తాళ్వార్‌కు వసంతోత్సవం నిర్వహించనున్నారు. తరువాత ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10.30 నుండి రాత్రి 11.30 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఊంజల సేవ జరుగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.