MAJESTIC KALPAVRUKSHA VAHANAM SWIFTLY CARRIES “RAJAMANNAR” _ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం
Srinivasa Mangapuram, 17 Feb. 20: Devotees were thrilled as Lord Kalyana Venkateswara appeared to bless His devotees in “Rajamannar” Alankara on the divine tree-Kalpavruksha vahanam on the fourth day of the ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Monday morning.
The beauty of the vahanam procession was further enhanced with mangala vaidyams, chakka bhajans teams and kolatas, while the devotees offered harati all along the procession.
DyEO Sri Yellappa, AEO Dhananjayudu, Superintendent Sri Chengalrayulu, Chief Archaka Sri Balaji Rangacharyulu, Inspector Sri Anil Kumar and other office staff also participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం
తిరుపతి, 2020 ఫిబ్రవరి 17: శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
నాలుగవ నాటి రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ప్రధాన అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.