FOUR MORE BOOKS RELEASED _ కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
 
తిరుపతి, 2024 డిసెంబరు 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు ఆవిష్కరించారు.
                      
ఇతిహాసాలలో మహర్షులు –  ధర్మప్రబోధాలు : ఆచార్య జి.దామోదరనాయుడు
`                        
రామాయణభారతాలకు ఇతిహాసాలని పేరు. రామాయణ రచయిత వాల్మీకి. భారతగ్రంథకర్త వ్యాసుడు. ఈ ఇరువురు తమ కాలంనాటి రాజుల చరిత్రలను, తాము దర్శించిన వారి స్వభావాలను యథాతథంగా వర్ణించినవారే.  వీరి జీవితం, బోధన, అనువర్తనం అన్నీ ఇతరులకు ఆదర్శప్రాయం. 
 
ఇందులో  మహర్షులతోపాటు, రాజర్షులు, దేవర్షులుకూడా ఉన్నారు. వీరందరు తమ పరిధిలో రాజులకు, రాజపరివారాలకు అలాగే సమాజంలోని వారికి ధార్మికసందేశాలు అందించినవారే. ఇలాంటి ఇతిహాసాలలోని మహర్షుల ధార్మిక ప్రబోధాంశాలను సేకరించి గ్రంథంగా తీర్చిదిద్దినారు. 
                       
తిరుమల తిరుపతి క్షేత్రమాహాత్మె (కన్నడ) : డాక్టర్‌ ఎం.జి.దేశ్పాండే
                                      
భృగుమహర్షి చర్యవల్ల మహాలక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడంతో శ్రీమహావిష్ణువు శ్రీవైకుంఠాన్ని వీడి శేషాచల పర్వతాన్ని చేరాడు. క్షేత్రాధిపతి అయిన శ్వేతవరాహస్వామి సహకారంతో వేంకటాచలంపై నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆకాశరాజ పుత్రిక అయిన పద్మావతిని వివాహమాడి భక్తులననుగ్రహిస్తూ శ్రీ వేంకటాచలంపై శ్రీనివాసుడు శ్రీ వేంకటేశ్వరునిగా, అర్చావతారమూర్తిగా కలియుగ ప్రత్యక్షదైవమై వెలిశాడు. ఈ వృత్తాంతాన్ని వేంకటాచల మాహాత్మ్యం పేరుతో 12 పురాణాల్లో వివరించారు. 
 
 ఈ పురాణాల్లోని వేంకటాచల మాహాత్మ్య కథాసారాన్ని సరళమైన వచనంలో టీటీడీ తెలుగులో ఇదివరకే ముద్రించింది. ఈ వేంకటాచల మాహాత్మ్యం కేవలం తెలుగువారికే పరిమితం కాకూడదని హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో కూడా అనువదింపజేసి ముద్రిస్తున్నది. 
 
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కీ జీవనీ ( హిందీ) : ఆచార్య ఐ.ఎన్‌.చంద్రశేఖర రెడ్డి
 
తిరుమల శ్రీవేంకటేశ్వరాస్వామివారిని తన సంకీర్తనలతో అర్చించి తరించిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. వివిధ ప్రక్రియలలో అష్టాదశ గ్రంథాలను రచించిన తరిగొండ వెంగమాంబ శ్రీనివాసుని తన భర్తగా భావించుకున్న పరమ సాధ్వీశిరోమణి. 
 
ఈమె పేరునే ప్రతిరోజు శ్రీనివాసుని ఏకాంతసేవలో ముత్యాలహారతి సమర్పించబడుతుంది.  ఇంతటి మహనీయురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను సమస్త భక్తజనావళికి తెలియజేసే ఉద్దేశంతో టీటీడీ  తెలుగులో ఇదివరకే వెలువడిన ఈ గ్రంథాన్ని హిందీ, ఇంగ్లీషు భాషలలో అనువదింపజేసి ముద్రిస్తున్నది. 
 
హనుమంతుని చరిత్ర : శ్రీ వావిలికొలను సుబ్బారావు
                            
శ్రీమద్రామాయణ మహాకావ్యంలో ఒక ఆణిముత్యంగా వెలుగొందినవాడు హనుమంతుడు. నవవ్యాకరణపండితునిగా, చతుర్వేదవేత్తగా శ్రీరాముడిచే హనుమంతుడు ప్రశంసింపబడ్డాడు. 
 
హనుమంతుడు ఎంతటి మహాబలపరాక్రమ సంపన్నుడో అంతటి బుద్ధిమతాంవరిష్ఠుడు కూడా.  అటువంటి మహనీయుడైన హనుమంతుని జీవితచరిత్రను ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతి గాంచిన శ్రీ వావిలికొలను సుబ్బారావు రచించారు.  
 
 ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.