GRAND RATHOTSAVAM OF SRI VENUGOPALA SWAMY HELD AMID GOVINDA CHANTS

Tirupati, June 13, 2026: As part of the annual Brahmotsavams of Sri Rukmini Satyabhama Sametha Sri Venugopala Swamy at Karvetinagaram, the grand Rathotsavam was held on Saturday morning with great religious fervour.

The Lord, accompanied by Sri Rukmini and Sri Satyabhama, blessed devotees from the temple chariot as it was ceremoniously pulled through the village streets amid Govinda namasmarana, bhajans and traditional music.

Devotees offered camphor haratis throughout the procession. Vedic rituals and special prayers were performed after the chariot returned to the temple.

Ashwa Vahanam will be held at 7 pm on Saturday, while Chakrasnanam and Dhwajavarohanam on June 14 will mark the conclusion of the Brahmotsavams.

Temple officials, priests and a large number of devotees participated in the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోవిందనామ స్మరణల మధ్య వైభవోపేతంగా శ్రీ వేణుగోపాలస్వామివారి రథోత్సవం

రుక్మిణిసత్యభామ సమేతుడై భక్తులను అనుగ్రహించిన గోకులానందుడు

తిరుపతి, 2026 జూన్ 13: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాద్యాలు, భజన బృందాల కీర్తనల మధ్య స్వామివారు దివ్య రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు మంగళ దర్శనం ప్రసాదించారు.

ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగగా, అడుగడుగునా కర్పూర హారతులతో స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనలతో గ్రామమంతా ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేదపారాయణం, ప్రబంధ పఠనం, శాత్తుమొర, హారతి కార్యక్రమాలు నిర్వహించారు.

రథోత్సవం చాటిచెప్పే ఆత్మతత్త్వ సందేశం

వేదాంత దృష్టిలో ఆత్మనే రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులుగా భావిస్తారు. ఈ రథోత్సవం ద్వారా శరీరానికి అతీతమైన ఆత్మస్వరూపాన్ని గ్రహించి ఆత్మానాత్మ వివేకాన్ని పెంపొందించుకోవాలనే గొప్ప తాత్త్విక సందేశాన్ని స్వామివారు భక్తులకు అందిస్తున్నారు.

 సాయంత్రం అశ్వవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి అశ్వవాహన సేవ భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జూన్ 14 చక్రస్నానంధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు

బ్రహ్మోత్సవాల చివరి రోజైన జూన్ 14 ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ధ్వజావరోహణం జరగడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది