కర్నూలులో ధనుర్మాస లక్ష్మీదీపారాధనకు విస్తృత ఏర్పాట్లు
కర్నూలులో ధనుర్మాస లక్ష్మీదీపారాధనకు విస్తృత ఏర్పాట్లు
తిరుపతి, 2021 జనవరి 07: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జనవరి 8న శుక్రవారం కర్నూలు నగరంలోని ఎపిఎస్‌పి మైదానంలో ధనుర్మాస లక్ష్మీదీపారాధన కార్యక్రమానికి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం విద్యుద్దీపాలతో, పుష్పాలతో శోభాయమానంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. కరోనా నేపథ్యంలో మైదానంలో మహిళలు భౌతిక దూరం పాటించి దీపాలు వెలిగించేందుకు వీలుగా దిమ్మెలు, బారీకేడ్లు, తివాచీలు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో భాగంగా వేదస్వస్తి, కనకధారాస్తోత్రం, మహాలక్ష్మీ అనుగ్రహ ఆవశ్యకత, దీప ప్రశస్తి, శ్రీమహాలక్ష్మీపూజ, దీప ప్రజ్వలన తరువాత శ్రీశ్రీశ్రీ మంత్రాలయం పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేస్తారు. ఆ తరువాత శ్రీ అలమేల్మంగ నామావళి, అష్టలక్ష్మీ వైభవం నృత్య రూపకం, గోవిందనామాల పారాయణం ఉంటుంది. ధనుర్మాసంలో సామూహిక దీపారాధన వల్ల ప్రపంచ మానవాళికి ఆరోగ్యం చేకూరుతుందని ఆగమ గ్రంథమైన కపింజల సంహితలోని అథర్వ రహస్యం అనే విభాగంలో పేర్కొనబడింది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.