KALYANAMASTU MUHURAT SOON-EO_ కల్యాణమస్తుకు త్వరలో ముహూర్తం ఖరారు : టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి
కల్యాణమస్తుకు త్వరలో ముహూర్తం ఖరారు : టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి
తిరుమల, 2021 డిసెంబర్ 08: టిటిడి త్వరలో నిర్వహించనున్న కల్యాణమస్తు సామూహిక వివాహాల నిర్వహణకు అర్చక స్వాములతో చర్చించి మంచి ముహూర్తాలను ఖరారు చేయవలసిందిగా టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో బుధవారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం నిర్వహించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందగానే శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే టీటీడీ అనుబంధ ఆలయాల్లో గోపూజ ప్రారంభించామని, మిగిలిన ఆలయాల్లో కూడా గోపూజ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని 6A, 6B ఆలయాల్లో కూడా గో పూజ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులతో చర్చించాలన్నారు. ప్రైవేట్ ఆలయాల్లో గోపూజ ప్రారంభించాలనుకునేవారికి కోరిన వెంటనే గోమాతను అందిస్తామన్నారు.
సనాతన ధార్మిక పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు అవసరమైన పుస్తకాలను విద్యార్థులకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జెఈఓ శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సీఈవో శ్రీ బాలాజీ, హెచ్ డిపిపి కార్యదర్శి శ్రీ రామారావు, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఛీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.