GOURIPEDDI VARDHANTI _ గౌరిపెద్ది పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయకం• ప్రముఖ శతవధాని శ్రీ భరత్ శర్మ
గౌరిపెద్ది పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయకం
• ప్రముఖ శతవధాని శ్రీ భరత్ శర్మ
– అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 34వ వర్ధంతి
తిరుపతి, 2025 జనవరి 21: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతవధాని శ్రీ భరత్ శర్మ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 34వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా తిరుపతికి చెందిన శ్రీ భరత్ శర్మ “ సాహితీ శిఖరం – శ్రీ గౌరిపెద్ది ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడై ఉండాలన్నారు. అదేవిధంగా శ్రీవారికి పరమ భక్తుడైన అన్నమాచార్యులవారు గానం చేసిన పద కవితలను విశ్లేషించి, శ్రీవారి భక్తుడైన గౌరిపెద్ది రామసుబ్బశర్మ పరిష్కరించారన్నారు. అన్నమాచార్యులవారు గానం చేసిన సంకీర్తనలను గౌరిపెద్ది వారు స్పష్టంగా తెలియజేశారని వివరించారు.
తిరుపతికి చెందిన ప్రముఖ శతవధాని శ్రీ ఆముదాల మురళి మాట్లాడుతూ, “ శ్రీ గౌరిపెద్ది – అన్నమయ్య కీర్తనల పరిష్కరణ ” అనే అంశంపై మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ గౌరి పెద్ది ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు 27 సంపుటలు పరిష్కరించడంలో గౌరి పెద్ది వారు విశేష కృషి చేశారన్నారు. భారత, భాగవత, పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను గౌరపెద్ది రామసుబ్బశర్మ మనకు అందించారని వివరించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ రాజగోపాల రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ గౌరి పెద్ది వెంకట భగవాన్, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, ఇతర అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.