ఘనంగా ఎస్వీ ప్రాచ్య కళాశాల 128వ వార్షికోత్సవం
ఘనంగా ఎస్వీ ప్రాచ్య కళాశాల 128వ వార్షికోత్సవం
తిరుపతి, మార్చి 5, 2013: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల 128వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ముఖ్య అంకణీయ అధికారి శ్రీ శేషశైలేంద్ర ప్రసంగిస్తూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎన్ని అవాంతరాలైనా వెనక్కు తగ్గకుండా దాన్ని చేరుకోవాలని సూచించారు. విజయవంతంగా కోర్సులు ముగించి బయటకు వెళ్లే విద్యార్థులు తమ కళాశాల గొప్పతనం గురించి నలుగురికీ తెలియజేయాలన్నారు. విద్యార్థులు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు వీలుగా కళాశాలలో కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులు శ్రద్ధ పెడితే చాలు ఎంతటి పరీక్షనైనా సులభంగా గట్టెక్కవచ్చన్నారు.
తితిదే విద్యాశాఖ డెప్యూటీ ఈవో, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కోనేటి పార్వతి కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. తితిదేలో 128వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మొదటి కళాశాల ఇదేనన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది.
అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తితిదే విద్యాశాఖ అధికారి శ్రీ పి.వి.శేషారెడ్డి పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ సురేంద్రనాయక్, అధ్యాపకులు శ్రీ హేమంత్‌కుమార్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.