ఘనంగా ముగిసిన అన్నమయ్య జయంతి ఉత్సవాలు
ఘనంగా ముగిసిన అన్నమయ్య జయంతి ఉత్సవాలు
తిరుపతి, మే 26, 2013: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 605వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. మే 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతి, తిరుచానూరు, తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను తితిదే వైభవంగా నిర్వహించింది.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఉదయం 8.00 గంటలకు శ్రీ కోదండరాముల ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను గానం చేశారు. అనంతరం సాహితీ సదస్సు నిర్వహించారు. ఇందులో సదస్సుకు అధ్యక్షత వహించిన అనంతపురానికి చెందిన డాక్టర్ జి.బాలసుబ్రమణ్యం ”అన్నమయ్య సంకీర్తనల్లోని సాంఘిక విలువలు’ అనే అంశంపై, తిరుపతికి చెందిన డాక్టర్ ఎస్.రాజేశ్వరి ‘అన్నమయ్య పదప్రయోగ నిర్మాణం’ అనే అంశంపై, కడపకు చెందిన డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి ‘అన్నమయ్య సంకీర్తనల్లోని కడప జిల్లా ఆలయాలు’ అనే అంశంపై, తిరుపతికి చెందిన డాక్టర్ డి.నల్లన్న ‘అన్నమయ్య హనుమత్సంకీర్తనలు’ అనే అంశాలపై ఉపన్యసించారు.
సాయంత్రం 6.00 నుండి 7.15 గంటల వరకు విశాఖపట్టణానికి చెందిన శ్రీ ఎస్.వెంకట్రావు గాత్ర సంగీత సభ, రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి టి.సరిత నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు సిద్ధిపేటకు చెందిన శ్రీ వై.పవన్‌కుమార్ సంగీత సభ, రాత్రి 6.15 నుండి 7.15 గంటల వరకు రాజమండ్రికి చెందిన శ్రీమతి తులసీ విశ్వనాథ్ సంగీత సభ, రాత్రి 7.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు హైదరాబాదుకు చెందిన సుధారాణి నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థానమండపంలో సాయంత్రం 5.00 నుండి 6.15 గంటల వరకు ఐరాలకు చెందిన శ్రీ పి.కన్నయ్య బృందం సంగీత సభ, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ డి.వి.సురేష్‌రావు, కుమారి డి.వి.సుష్మ బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.