ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

తిరుపతి, మే 29, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు రెండో రోజు బుధవారం వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
 
మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఆలయం వెలువల గల మండపంలో ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సూపరింటెండెంట్లు శ్రీ కృష్ణారావు, శ్రీ దినకర్‌రాజు, ఇతర అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.