ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
 
తిరుపతి, మే 24, 2013: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 605వ జయంతి ఉత్సవాలు తిరుపతిలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, తిరుచానూరులోని శ్రీపద్మావతీ అమ్మవారి ఆస్థాన మండపంలో ప్రత్యేక సాహిత్య, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.00 గంట వరకు తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య అధ్యక్షతన ”అన్నమయ్య వాఙ్మయంలో పురాణాలు” అనే అంశంపై సాహితీ సదస్సు జరిగింది. ఇందులో తిరుపతికి చెందిన డాక్టర్‌ సి.లలితకుమారి ”అప్పని వరప్రసాది అన్నమయ్య” అనే అంశంపై, చిత్తూరుకు చెందిన డాక్టర్‌ వి.రాఘవన్‌ ”అన్నమయ్య సంకీర్తనలు-విశిష్టాద్వైతం” అనే అంశంపై, తిరుపతికి చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కర్‌రెడ్డి ”అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యాన ఆవశ్యకత” అనే అంశంపై ఉపన్యసించారు.
సాయంత్రం 6.00 నుండి 7.15 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎస్‌.శ్రీనివాస కిషోర్‌ బృందం సంగీత సభ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం జరుగనున్నాయి.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుపతికి చెందిన మోనీషా బృందం సంగీత సభ, రాత్రి 6.15 నుండి 7.15 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి స్వర్ణలతా చంథ్రేఖరన్‌ సంగీత సభ, రాత్రి 7.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎం.ధనశ్రీ శ్రీనివాస్‌ నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థానమండపంలో సాయంత్రం 5.00 నుండి 6.15 గంటల వరకు తిరుపతికి చెందిన కుమారి ఎం.దేవిప్రియాంక బృందం సంగీత సభ, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన కుమారి బి.భావన బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.
            ———————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.