ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు
ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు
తిరుపతి, 2012 జూలై 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవం రెండో రోజు ఘనంగా జరిగింది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, అష్టాదళపాదపద్మారాధన సేవ నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పన్నీరు, అత్తరు, యాలకులు, పచ్చకర్పూరం, లవంగాల పొడి, ఒట్టివేరు, తేనె, పాలు, పెరుగు , కొబ్బరినీళ్లు, పసుపు, చందనం కలిపిన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. అవతారోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిష్టించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పరిసర ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ గోపాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వేణుగోపాల్, సూపరింటెండెంట్ శ్రీ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.