ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు

ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు

తిరుపతి, జూన్‌ 29, 2013:  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. రెండో రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, సామవేద పుష్పాంజలి సేవ నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. మధ్యాహ్నం ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. కాగా ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.