ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి నీరాటోత్సవం

ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి నీరాటోత్సవం

తిరుప‌తి, 08 జ‌న‌వ‌రి 2020: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు బుధ‌వారం ఉదయం స్వామి వారికి ధనుర్మాస, నిత్య కైంకర్యాలు నిర్వహించిన ఆనంతరం శ్రీఆండాళ్ అమ్మవారిని పల్లకిలో వేంచేపు చేసి విశేషాలంకరణ చేశారు. ఉద‌యం 5.30 గంటల నుంచి చిన్నమాడ వీది, పూలమఠం, చిన్నబజారు వీది, రామాలయం నాలుగు మాడ వీధుల‌ మీదుగా రామచంద్ర కట్టమీద మండపానికి చేరుకున్నారు. అక్కడ ఏకాంత తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి యథాప్రకారంగా ఊరేగింపుగా శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

శ్రీపార్థసారథి స్వామికి  రోహిణి అభిషేకం మరియు ఆస్థానం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉప ఆలయమైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీపార్థసారథి స్వామివారికి రోహిణీ నక్షత్రం (జన్మ నక్షత్రం) సందర్భంగా ఆస్థానం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా, ఉదయం శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీపార్థసారథి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తరువాత సాయంత్రం ఆలయంలో రోహిణీ ఆస్థానం నిర్వహించారు.
           

ఈ కార్యక్రమాలలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఇఓ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు జ్ఞానప్రకాష్, శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ‌ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.