KOIL ALWAR AT CHANDRAGIRI RAMALAYAM HELD _ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 01 April 2025: The annual Brahmotsavams in Sri Kodanda Ramalayam at Chandragiri are going to commence on April 06 and in this connection, Koil Alwar Tirumanjanam was held on Tuesday.
The annual fete will conclude on April 14 while on Sri Sita Rama Kalyanam will be observed on April 12 and Sri Rama Pattabhishekam on April 15.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025 ఏప్రిల్ 01: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం 9 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి బాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 6న ధ్వజారోహణం :
ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సర్లకు, చక్రత్తాళ్వార్‌కు వసంతోత్సవం నిర్వహించనున్నారు. తరువాత ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10.30 నుండి రాత్రి 11.30 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఊంజల సేవ జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.