చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి చిద్విలాసం

చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి చిద్విలాసం

తిరుపతి, మే, 18, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం స్వామివారు దేవేరులతో కలసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.

చిన్నశేష వాహనం ”వాసుకి” గాను భావించవచ్చును. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం – శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తున్నది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుంది.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7.30 గంటల నుండి 9.30గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సో హం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శ్రీగోవిందరాజస్వామి పుష్కరిణి, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెదజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.