జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం
జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం
తిరుమల, జనవరి – 08, 2011 : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జనవరి 15వ తేదిన ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దుచేశారు. ఇదే రోజున ఉదయం 6 గంటలకు శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం నుండి గోదాదేవి అమ్మవారి పవిత్రమాలను తిరుమల ఆలయానికి తీసుకువస్తారు.
పారువేట ఉత్సవం:-
ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు తిరుమలలో పారువేట ఉత్సవం జరుగుతుంది. ఆరోజు ఆలయంలో రెండవ నైవేద్యం ముగిసిన తర్వాత శ్రీస్వామివారు పంచాయుధాలను ధరించి, వేటకు బయలుదేరుతారు. మరొక పల్లకిపై శ్రీకృష్ణస్వామి వేంచేస్తారు.
శ్రీవారి ఆలయానికి వాయువ్యమూలలో 1 మైలు దూరంలో వున్న పారువేట మండపానికి వేంచేసి సాయంత్రం వరకు అక్కడనే వుండి శ్రీస్వామివారు వేట కార్యక్రమంలో పాల్గొంటారు. పారువేటలో తాళ్ళపాకవారి సేవలందు కొంటారు. శ్రీకృష్ణస్వామి ఆపక్కనే వున్న కొల్లల విడిదికి వెళ్ళి వారి అర్చనలందు కొంటారు.
సంగీత ధార్మిక కార్యక్రమాలతో ఘనంగా జరిగే పారువేట ఉత్సవంలో వేలాది మంది పాల్గొంటారు. ఆసాయంత్రం మళ్ళీ యధాక్రమంగా శ్రీవారు ఆలయానికి వేంచేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.