SPECIAL SAHASRA KALASHABHISHEKAM FOR SRI BHOGA SRINIVASA MURTHY ON JUNE 1 _జూన్ 1న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
జూన్ 1న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
తిరుమల, 2025 మే 31: శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 1వ తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు.
శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీనులు చేస్తారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేస్తారు.
అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చకస్వాములు ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.