AMMAVARI TEPPOTSAVAMS FROM JUNE 10-14 _ జూన్ 10 నుండి 14వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
TIRUPATI, 08 JUNE 2022: The annual Teppotsavams of Tiruchanoor are scheduled from June 10 to June 14.
Everyday the float festival will take place in Padma Sarovaram between 6:30pm and 7:30pm.
TTD has cancelled all arjita sevas including Kalyanotsavam and Unjal Seva in connection with this float festival on these days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 10 నుండి 14వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుపతి, 2022 జూన్ 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షసుఖం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తుందని ఈ తెప్పోత్సవాల అంతరార్థం.
జూన్ 10వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 నుండి 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. అమ్మవారికి జూన్ 13వ తేదీ రాత్రి 8 గంటలకు గజవాహనం, 14వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.