జూన్‌ 22న తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారం ఊరేగింపు

జూన్‌ 22న తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారం ఊరేగింపు

తిరుపతి, జూన్‌ 21, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మీహారాన్ని ఉదయం 10.30 గంటలకు తిరుపతికి తీసుకొస్తారు. శ్రీవారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, అర్చకులు లక్ష్మీహారాన్ని తీసుకొచ్చి శ్రీనివాసంలో అప్పలాయగుంట ఆలయ అధికారులకు అప్పగిస్తారు. అక్కడినుండి అప్పలాయగుంట పురవీధుల్లో ప్రదర్శనగా స్వామివారి ఆలయానికి తీసుకెళతారు.

శనివారం రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడుడిని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు పల్లకిలో మోహినీ అవతారంలో స్వామివారు ఊరేగనున్నారు. గరుడ సేవ సందర్భంగా తిరుపతి నుండి అరగంటకో ఆర్‌టిసి బస్సును అప్పలాయగుంటకు నడపనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.