ANIVARA ASTHANAM ON JULY 16 IN TIRUMALA _ జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
TIRUMALA, 14 JULY 2024: The traditional annual budget festival, Anivara Asthanam will be observed in Tirumala temple on July 16.
The Utsava deities of Sri Malayappa, Sridevi and Bhudevi along with Sri Vishwaksena will be seated in the Ghanta Mandapam at Bangaru Vakili inside the temple facing Garudalwar.
On the occasion, Sri Pedda Jeeyar Swamy offers six Pattu Vastrams out of which four will be adorned to main deity and one to Malayappa and another to Vishwaksena.
Later the archakas hang the temple treasure Keys on the right hand of Sri Pedda Jeeyar, Sri Chinna Jeeyar of Tirumala and TTD EO following age old tradition and later place the keys at the holy feet of Srivaru.
In the evening, the procession of Pushpa Pallaki takes place.
TTD has cancelled all arjita sevas including Astadala Pada Padmaradhama on the day following Anivara Asthanam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
తిరుమల, 2024 జూలై 14: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది.
చారిత్రక నేపథ్యం :
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఉత్సవ విశిష్టత :
ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ :
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామివారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.
పుష్ప పల్లకీపై ఊరేగింపు :
ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
ఆణివార ఆస్థానం కారణంగా జూలై 16న అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.