జూలై 18 నుండి 28వ తేదీ వరకు శ్రీ జయతీర్థులవారి ఆరాధన ఉత్సవాలు

జూలై 18 నుండి 28వ తేదీ వరకు శ్రీ జయతీర్థులవారి ఆరాధన ఉత్సవాలు

తిరుపతి, జూన్‌ 27, 2013: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 18 నుండి 28వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శ్రీ జయతీర్థులవారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరుడి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భజన మండళ్లను ఏర్పాటుచేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే గురువందన మహోత్సవం, వసంత శిక్షణ శిబిరాలు తదితర కార్యక్రమాలు చేపడుతోంది. జూలై 18వ తేదీన తిరుమలలో శ్రీ జయతీర్థుల వారి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ జూలై 27వ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో న్యాయసుధా పారాయణం నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 23 నుండి 27వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. జూలై 23 నుండి 28వ తేదీ వరకు గుల్బర్గా జిల్లాలోని మలఖేద పట్టణంలో గల మూల బృందావనంలో ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ప్రముఖ పండితులు పాల్గొని న్యాయసుధా పారాయణం చేస్తారు. అదేవిధంగా భజన మండళ్లతో కోలాటాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య తెలిపారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.