జూలై 3వ తేదీన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘వామ్మో..! టిటిడిలో తెల్ల ఏనుగులు..!?’ అనే వార్త‌కు వివరణ

జూలై 3వ తేదీన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘వామ్మో..! టిటిడిలో తెల్ల ఏనుగులు..!?’ అనే వార్త‌కు వివరణ

తిరుపతి, 2012 ఆగస్టు 6: జూలై 3వ తేదీన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘వామ్మో..! టిటిడిలో తెల్ల ఏనుగులు..!?’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

ప్రపంచప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తితిదేలోని వివిధ విభాగాలలో కీలకపాత్రను పోషిస్తూ సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న వ్యక్తులపై వార్తలు రాయడం శోచనీయం. తితిదే పాలకులు ఒకపక్క భక్తుల సౌకర్యాలపై, మరోపక్క పాలనా వ్యవహారాలపై అకుంఠిత దీక్షతో శక్తివంచన లేకుండా ప్రయోజనకరమైన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. తితిదేలో పదవీ విరమణ చేసిన వారిని కాంట్రాక్టు పద్ధతిలో అదేస్థానంలో కొనసాగిస్తూ తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడం అనే నిర్ణయం కూడా పాలకులు ఎంతో సునిశితంగా వారి కార్యదక్షతను గమనించిన తరువాత అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అంతేకాని ఇందులో ఎటువంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవన్నది సుస్పష్టం. కానీ సదరు వార్తలో వ్యక్తులపై ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచురించడం బాధాకరం. ఇది వారిని మానసికంగా ఎంతో కృంగదీసే రీతిలో ఉన్నది.

సదరు వార్త పత్రికలో పేర్కొన్న విధంగా తితిదే రవాణా అధికారి అయిన శ్రీ శేషారెడ్డి, పదవి విరమణ చెంది తిరిగి కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న పార్‌పత్తేదార్‌ శ్రీ పి.శేషాద్రి, డెప్యూటీ క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీ సుబ్రమణ్యం వంటివారి విశేషసేవలను గుర్తించి తితిదే వారి సేవలను వినియోగించుకుంటోంది.

సదరు వార్త పత్రికలో పేర్కొన్నట్టుగా ఆర్‌టిసి సంస్థలో అధికారిగా పనిచేస్తున్న శ్రీ శేషారెడ్డి తితిదే నోటిఫికేషన్‌ ద్వారా ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉద్యోగాన్ని పొందారు. తితిదేలో రవాణా శాఖ అభివృద్ధికి విశేషరీతిలో సేవలు అందిస్తున్నారు. ఇంకా ఇదే వార్తలో పేర్కొన్న శ్రీ విభీషణశర్మ అనే వ్యక్తి తితిదే ఉద్యోగి. ఆయనకు సంస్కృత ఆంధ్ర భాషల్లో ఉన్న పాండిత్యాన్ని గమనించి తితిదే పాలకులు పదోన్నతి కల్పించారు.

         దాదాపు 35 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో విశేష సేవలు అందిస్తున్న శ్రీ పి.శేషాద్రి కాంట్రాక్టు పదవీ కాలాన్ని మరో రెండేళ్లకు తితిదే పొడిగింపునిచ్చింది. ఆలయంలో స్వామివారికి జరిగే అన్ని సేవల నిర్వహణను గ్రంథస్థం చేయాలనే సంకల్పంతో, వీరి సేవలను ఇతర అర్చక, వేద పండితులకు మార్గదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తితిదే నిర్ణయించింది. అదేరీతిలో ఇటీవల తితిదే డెప్యూటీ క్యాటరింగ్‌ ఆఫీసర్‌గా పదవి విరమణ పొందిన శ్రీ జి.సుబ్రమణ్యం ఆ విభాగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా తిరిగి అదేస్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో నియమించింది. తితిదే పాలకులు సదరు వార్త పత్రికలో పేర్కొన్న వ్యక్తుల నియామకం గురించి చేపట్టిన నిర్ణయాలు అన్నీ వారి విద్యార్హతలు, ప్రతిభాపాటవాలను, దీక్షాదక్షతలను, సేవలను గుర్తించి తీసుకోవడం జరిగినదేనని తెలపడమైనది.


ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి