జ‌న‌వ‌రి 15న సూర్యగ్రహణం సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మూత‌

జ‌న‌వ‌రి 15న సూర్యగ్రహణం సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మూత‌

తిరుపతి,  2010 జనవరి 07: ఈనెల 15వ తేదిన సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని  ఉదయం 5.30 గంటలకు మూసివేస్తారు.

సూర్యగ్రహణం సందర్భంగా తిరుమలేశునికి నిత్యం నిర్వహించే ఉత్సవాలు, సేవలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 15వ తేది ఉదయం 12.05 గంటలకు సుప్రభాతం (ఏకాంతం) సేవ, నిత్యకట్ల కైంకర్యాలు, అభిషేకం పూర్తి చేస్తారు. వేకువజామున 3 నుంచి 5.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనంకు అనుమతించి అనంతరం 5.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు తిరిగి తెరచి శుద్ది, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం :

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జనవరి 15వ తేదిన ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దుచేశారు. ఇదే రోజున ఉదయం 6 గంటలకు శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం నుండి గోదాదేవి అమ్మవారి పవిత్రమాలను తిరుమల ఆలయానికి తీసుకువస్తారు.

పారువేట ఉత్సవం:

ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు తిరుమలలో పారువేట ఉత్సవం జరుగుతుంది. ఆరోజు ఆలయంలో రెండవ నైవేద్యం ముగిసిన తర్వాత శ్రీస్వామివారు పంచాయుధాలను ధరించి, వేటకు బయలుదేరుతారు. మరొక పల్లకిపై శ్రీకృష్ణస్వామి వేంచేస్తారు.

శ్రీవారి ఆలయానికి వాయువ్యమూలలో 1 మైలు దూరంలో వున్న పారువేట మండపానికి  వేంచేసి సాయంత్రం వరకు అక్కడనే వుండి శ్రీస్వామివారు వేట కార్యక్రమంలో పాల్గొంటారు.  పారువేటలో తాళ్ళపాకవారి సేవలందు కొంటారు. శ్రీకృష్ణస్వామి ఆపక్కనే వున్న కొల్లల విడిదికి వెళ్ళి వారి అర్చనలందు కొంటారు.
 
సంగీత ధార్మిక కార్యక్రమాలతో ఘనంగా జరిగే పారువేట ఉత్సవంలో వేలాది మంది పాల్గొంటారు. ఆసాయంత్రం మళ్ళీ యధాక్రమంగా శ్రీవారు ఆలయానికి వేంచేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.