టిటిడి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సెల్ ఏర్పాటు – ఈవో

టిటిడి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సెల్ ఏర్పాటు – ఈవో

తిరుపతి, 2010 ఫిబ్రవరి 23: తిరుమల తిరుపతి దేవస్థానములలో కాంట్రాక్ట్‌ పద్దతిన పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు తెలిపారు.
 
ఐక్యపోరాట కమిటీ నాయకులతో మంగళవారం మధ్యాహ్నం కార్మికుల సమస్యలపై ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడానికిగాను ఏర్పాటు చేయనున్న ప్రత్యేకసెల్‌కు తితిదే సంక్షేమ అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

భక్తులకు సేవలు చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు న్యాయబద్దంగా ఇవ్వాల్సిన నెలసరి జీతాలు బ్యాంకుల ద్వారా ఇది వరకే చెల్లిస్తున్నామని, ఇ.ఎస్‌.ఐ., పి.ఎఫ్‌. ఇప్పటికే వారి ఖాతాలకు జమ అవుతున్నాయని ఆయన చెప్పారు.

తిరుమలలో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులకు అవసరమైన బస్సు పాస్‌లను పాలకమండలి అనుమతితో తితిదే సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నామని, తద్వారా వారు కాంట్రాక్టర్‌పై ఆధారపడవలసిన అవసరంలేదని అన్నారు.

అదేవిధంగా హిందూధర్మప్రచార పరిషత్‌లో పనిచేస్తున్న పురాణ పండితులకు 57 పోస్టుల మంజూరు చేయడానికిగాను ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, 1999 సంవత్సరం ముందు నుండి పనిచేస్తున్న దాదాపు 20 మంది పురాణపండితులకు జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ వర్తిస్తూ వారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నామని, మిగిలిన వారికి ఆయా పోస్టుల ఎంపికలో కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇక ఫారెస్ట్‌ కార్మికులు, తిరుమల నిర్వాసితులు, వెండార్స్‌ సమస్యలను పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.