RATHA SAPTHAMI AT ALL TTD LOCAL TEMPLES ON FEB 1 _ టిటిడి స్థానికాల‌యాల్లో రథసప్తమికి స‌ర్వం సిద్ధం

Tirupati, 31 January 2020: TTD is organising grand celebrations of the holy Ratha Sapthami at its local temples on February 1.

It is a popular practice of TTD to conduct Surya Prabha vahanam  as a part of the Ratha Sapthami festival on the day of Surya Jayanti, which occurs on Magha  Suddha  Sapthami at all premiere temples like Sri  Padmavathi temple,Tiruchanoor, Sri Govindarajaswamy temple,Sri Kodandaramaswami temple, Sri Kalyayan Venkateswara temple at Srinivasa Mangapuram.

Similarly Ratha Sapthami events will also be observed at Appalayagunta,  Karveti Nagaram, Nagari, Satravada etc.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి స్థానికాల‌యాల్లో రథసప్తమికి స‌ర్వం సిద్ధం

జనవరి 31, తిరుపతి 2020: టిటిడికి అనుబంధంగా ఉన్న ఆల‌యాల్లో ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ శ‌నివారం రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఆయా ఆల‌యాల్లో చ‌లువ‌పందిళ్లు వేసి విద్యుద్దీపాలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి నుదుట‌న‌, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ‌నివారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.

ర‌థ‌స‌ప్త‌మి కార‌ణంగా ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, సామ‌వేద పుష్పాంజ‌లి, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌తోపాటు సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాన్ని ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న‌ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వ‌ర‌కు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం క‌ల్పిస్తారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటల వరకు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సూర్యప్రభవాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు సూర్య‌ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్ర‌హిస్తారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ….
 
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ….
 
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహనాలు, తిరుచ్చిపై స్వామివారు ఊరేగి భక్తులను అనుగ్ర‌హిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జ‌రుగ‌నుంది.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించ‌నున్నారు.

న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌రియ మాణిక్య‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆర్జిత క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు.

స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌ప్ర‌భ వాహ‌నం గ్రామోత్స‌వం చేప‌డ‌తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.